పశ్చిమలో మళ్ళీ వింతవ్యాధి కలకలం

ఆసుపత్రిలో చేరిన ఇద్దరు బాధితులు

By udayam on January 19th / 8:31 am IST

పశ్చిమ గోదావరి : మొన్నటికి మొన్న ఏలూరులో వింతవ్యాధి కలకలం రేపగా తాజాగా, వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో కలకలం సృష్టిస్తున్నాయి.

తాజాగా ఇద్దరు బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధితుల సంఖ్య 20కి చేరిందని చెబుతున్నారు.

ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి.

వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో 5 వైద్య బృందాలు ఏర్పాటుచేశారు. వింత వ్యాధి బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ సునంద పరామర్శించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్‌లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.

ఇక పూళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స తో ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు.