4:56 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

మహారాష్ట్రలో వర్షాలకు 27 మంది మృతి 2 weeks ago

పూణే: నిన్నటిదాకా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పుడు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైతో పాటు పూణే, షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. లోతట్టుప్రాంతాల్లో నివాసముంటున్న 20వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్పారు. ముంబై నగరంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. ముంబై నగరంలో భారీవర్షాల వల్ల శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలో భారీవర్షాల వల్ల హైఅలర్ట్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా పూణే, షోలాపూర్, సాంగ్లీ, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో భారీవర్షం కురుస్తోంది. పూణే, షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో వరదల వల్ల 27 మంది మరణించారు.  షోలాపూర్ జిల్లాలో 14 మంది, సాంగ్లీ జిల్లాలో 9 మంది, పూణే జిల్లాలో నలుగురు మరణించారని పూణే డివిజనల్ కమిషనర్ చెప్పారు.

షోలాపూర్ జిల్లా పంధార్ పూర్ పట్టణంలో గోడ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.   ఉజ్జయిని డ్యామ్ నుంచి నీరా, భీమా నదుల్లోకి వరద నీరు  విడుదల చేశారు. నదీ తీర ప్రాంత పంధార్ పూర్ తహసీల్ పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని షోలాపూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ చెప్పారు. పంధార్ పూర్ పట్టణంలో 1650 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు చెప్పారు.