బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు

By udayam on January 11th / 1:09 pm IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, వారి నుంచి సెల్‌ఫోన్లు, నకిలీ నెంబర్‌ ప్లేట్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

సోమవారం మీడియాకు ఆయన కీలక వివరాలను వివరిస్తూ ఆరు సిమ్‌కార్డులను మియాపూర్‌లోని మొబైల్‌ షాప్‌లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పారని తెలిపారు.

కిడ్నాప్‌ కేసులో ఇప్పటికే మాజీమంత్రి అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్నారు. కూకట్‌పల్లిలోని నిందితులు ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారని, కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు.

ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. ప్రవీణ్‌రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

అఖిలప్రియ నెంబర్‌ నుంచి గుంటూరు శ్రీనుకు 49 ఫోన్ కాల్స్ రాగా, గుంటూరు శ్రీను నుంచి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్‌ వచ్చాయని సిపి చెప్పారు.

గుంటూరు శ్రీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్‌ వచ్చాయని, కిడ్నాప్‌ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో శ్రీను మాట్లాడాడని, కిడ్నాప్‌ కేసులో మొత్తం 143 కాల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసినట్లు వివరించారు.

మొత్తం మీద ఈ గ్యాంగ్ కిడ్నాప్‌ కోసం 6 టెంపరరీ సిమ్స్‌ ‌ ఉపయోగించిందని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. నిందితుల మధ్య ఫోన్ సంభాషణ మ్యాప్ ద్వారా చూపించారు. ఇక అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ద్రువీకరించినట్లు సిపి చెప్పారు.