శివమొగ్గ జిల్లాలో పేలుడు

8 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

By udayam on January 22nd / 5:27 am IST

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న అబ్బలగెరి తాలూకా హుణసోడు గ్రామంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది.

శివమొగ్గ నగరానికి చెందిన ఒక ప్రైవేటు రైల్వే క్రషర్‌ (రాళ్ల గని)‌కు లారీలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు తీసుకొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

సుమారు 50 వరకు డైనమేట్లను రవాణా చేస్తున్నట్లు తెల్సింది. ఈ ఘటనలో ఎనిమిది మృతదేహాలు వెలుగుచూశాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పేలుడు ధాటికి లారీ, దాని పక్కనే ఉన్న బొలేరే వాహనం ముక్కలుముక్కలయింది. ఎనిమిది మంది శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దం సుమారు 20 – 30 కిలోమీటర్ల వరకు తాకింది.

అంతేకాక తీర్థహళ్లి, హోసనగర, సాగర, భద్రావతి వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదారు సెకన్లపాటు భూమి కంపించింది.

చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు, ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన మరికొంతమంది కార్మికులు మృతిచెంది ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను చేపట్టారు.