కమలం గూటికి రాములమ్మ?

By udayam on October 28th / 7:35 am IST

సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తిరిగి బిజెపిలోకి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి బిజెపి నుంచే ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది.

అనంతరం తెలంగాణా ఉద్యమం కోసం టిఆర్ఎస్ లో చేరి, ఎంపీగా కూడా పనిచేసిన విజయశాంతి తర్వాత ఆ పార్టీ నేతలతో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ గూటికి చేరింది.

ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా ఉంటున్న ఆమె ఇటీవల కాంగ్రెస్ లోని ఓ వర్గంపై విమర్శలు కూడా గుప్పించింది. ఓ పక్క దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు వేడందుకున్న నేపథ్యంలో విజయశాంతి బిజెపి వైపు అడుగు వేస్తుందన్న వార్తలు వస్తున్నాయి.

దీనికి తోడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తాజాగా విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ కావడం, దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరపడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.

పైగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తోన్న విజయశాంతి తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ సహజంగానే రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విజయశాంతిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారని, త్వరలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.