అప్పటిదాకా కూల్చొద్దు, నిర్మాణాలు చెపొట్టోద్దు : గీతం ఘటనపై కోర్టు

By udayam on October 27th / 9:53 am IST

అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ, యండాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలను చేపట్టారన్న అభియోగంపై గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం) విద్యా సంస్థల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ వరకు గీతం నిర్మాణాలను కూడా కూల్చొద్దని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది.

అసలు ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ నవంబర్‌ 30కి వాయిదా వేస్తూ .. న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గీతం యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అందులో చేసిన పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా తెల్లవారుఝామున వచ్చి కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని టిడిపి నేతలు విమర్శించారు. అయితే ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చివేసిన ట్లు అధికారులు చెబుతున్నారు.

దీంతో గీతం యాజమాన్యం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఆదివారం న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌రెడ్డి తన ఇంటి వద్ద వాదనలు విన్నారు. గీతంకు విద్యా దాహానికి బదులు భూదాహం పట్టుకుందని, తమ భూముల్లోకి తాము వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అధికారులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చేశారని గీతం తరఫు న్యాయవాది రుద్రప్రసాద్‌ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు గీతంకు అనుమతి ఇచ్చారు.

కాగా ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని,టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు కూల్చివేతతోనే వైసిపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. గీతం సంస్థ అధిపతిగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండవ అల్లుడు భరత్ వ్యవహరిస్తున్నారు. ఈయన మొన్నటి ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుంచి పోటీచేసి వైసిపి చేతిలో ఓటమి చెందారు.