‘ఐబీపీఎస్‌’లో ఏపీ రికార్డు

10వేల ఉద్యోగాలు కల్పించిన తోలి రాష్ట్రం

By udayam on February 23rd / 9:23 am IST

అమరావతి: కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీమ్‌ (ఐబీపీఎస్‌) కింద అత్యధిక బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్( బీపీవో) యూనిట్లు ఏపీ రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖ ఐబీపీఎస్‌ ప్రవేశపెట్టింది.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యే బీపీవో యూనిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ కింద ఏర్పాటు చేసే ప్రతి సీటుకు గరిష్టంగా రూ.లక్ష ప్రోత్సాహం వస్తుంది.

అదే మహిళలకు ఉపాధి కల్పిస్తే 5 శాతం, దివ్యాంగులకైతే మరో 5 శాతం అదనంగా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. ఐటీ‌ (బీపీవో) కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఐబీపీఎస్‌ కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,792 సీట్లు కేటాయించగా,  అందులో ఎపిలోనే 13,792 సీట్లున్నాయి.

ఈ పథకం కింద ఏపీలో 10,365 మంది స్థానికులకు నేరుగా ఉపాధి లభించిందని, తద్వారా 10వేల మార్కు అందుకున్న తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కిందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 11 పట్టణాల్లో బీపీవో యూనిట్లు నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించామన్నారు.

ట్యాగ్స్​