తెలుగు రాష్ట్రాలకు చేరిన వాక్సిన్

By udayam on January 12th / 8:09 am IST

అమరావతి : ఈనెల 16న దేశవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్ మొదలు కానున్న నేపథ్యంలో దేశంలోని ఆయా రాష్ట్రాలకు వాక్సీన్స్ పంపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు అలాగే గన్నవరం కి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరింది.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్‌ కూడా పూర్తి చేసింది.

వ్యాక్సిన్‌ పంపిణీలో వృధాను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన లబ్ధిదారుల నిష్పత్తి (1.19 లక్షల)కి అదనంగా పది శాతం (1.30 లక్షలు)డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది.

గన్నవరం కోవిషీల్డ్‌ చేరుతున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కోవిషీల్డ్‌ను గన్నవరంలోని రాష్ట్ర శీతలీకరణ కేంద్రానికి అధికారులు తరలిస్తున్నారు.

రేపు జిల్లా కేంద్రాలకు చేరిక ….

ఏపీ కి వాక్సిన్ చేరడంతో రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది . 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలివరీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద కూలర్లు ఏర్పాటు చేశారు.

వ్యాక్సిన్‌ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. గన్నవరం స్టోరేజ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్టోరేజ్‌ కేంద్రం వద్ద 8 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.లిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగనుంది.