అమరావతి: తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు.. గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభ తీసుకువచ్చాయన్నారు.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు ఈ సంక్రాంతి పండగ ప్రతీక అని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను#Sankranthi
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2021
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశచరిత్రలో ఏ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇక మీదట ఇదే విధానం కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రం లోని ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవా లని సీఎం జగన్ ఆకాక్షించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.