రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం

By udayam on January 19th / 10:06 am IST

అమరావతి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడికి మంగళవారం ప్రయత్నించింది.

గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు మెమొరాండం సమర్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.

అలాగే హైదరాబాద్‌లో కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌ ముట్టడికి లుంబినీ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.

పాత సచివాలయం వద్దకు రాగానే పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.