నిమ్మగడ్డ తాజా నిర్ణయం వివాదాస్పదం

By udayam on January 12th / 8:18 am IST

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదానికి దారితీసింది. ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, అనారోగ్యం కారణంగా మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సాయిప్రసాద్‌పై ఈ మేరకు తీవ్ర చర్య తీసుకున్నారు.

అనారోగ్య సమస్యలతో ఆదివారం నుంచి నెలరోజులపాటు జీవీ సాయిప్రసాద్ మెడికల్‌ లీవ్‌ పెట్టారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్‌ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్‌ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్‌ పెట్టారు.

ఈ ముగ్గురు లీవ్‌ పెట్టినప్పటికి జేడీ సాయిప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకోవడం లో ఆంతర్యమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కనీసం ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం, అంతేగాక పదవీ విరమణ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తన ఉత్తర్వులలో పేర్కొనడం ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశమైంది.

పైగా సోమవారం సాయంత్రం హైకోర్టు కొట్టివేయడానికి ముందుగా నిమ్మగడ్డ ఈ ఉత్తర్వులిచ్చారు. నిమ్మగడ్డ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.