అసోం-మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మృతి చెందారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్రో గ్రామంలో జరిగిందీ ఘటన. చనిపోయిన వారిలో ఐదుగురు మేఘాలయకు చెందిన వారు కాగా, ఒకరు అసోం ఫారెస్ట్ గార్డ్. నిన్న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అసోం అటవీ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లు వాహనాన్ని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. ఛేజ్ చేసిన ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మేఘాలయకు చెందిన ఐదుగురితోపాటు అసోం ఫారెస్ట్ గార్డు కూడా మృతి చెందినట్టు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ధ్రువీకరించారు.