రాముడి పేరుతో అయోధ్య ఎయిర్‌పోర్టు

అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయింపు

By udayam on February 23rd / 5:46 am IST

లక్నో: అయోధ్య .. ఈపేరు వినగానే  హిందూవుల చిరకాల కల గుర్తొస్తుంది. ఇక  కోట్లాది మంది ప్రజల భక్తిభావనతో ముడిపడిన క్షేత్రం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి.

ఇప్పటికే విరాళాలు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణం ఒక్కో దశ పూర్తి చేసుకుంటోంది. ఆలయ నిర్మాణంతో పాటు అయోధ్య నగర రూపురేఖలు మారుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే విమానాశ్రయం సిద్ధమవుతుండగా తాజాగా ఎయిర్‌ పోర్టుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త పేరు పెట్టింది. రాముడి పేరు వచ్చేలా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన సోమవారం జారీ చేశారు. ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్టు’ అని నామకరణం చేశారు.

అంతేకాదు, తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో యోగి ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయించింది. ఈ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాడుతోంది.

రాష్ట్రంలోని అలీగడ్‌, మొరాదాబాద్‌, మీరట్‌ వంటి నగరాల నుంచి అయోధ్యకు రాకపోకలు ప్రారంభించనున్నట్లు యోగి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కొన్ని నగరాలకు యోగి ప్రభుత్వం కొత్త పేర్లు పెడుతోంది.