తస్మాత్​ జాగ్రత్త.. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..

By udayam on October 28th / 7:02 am IST

హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఓటీపీ, పిన్‌ నెంబర్లు కాజేసి డబ్బులు తస్కరిస్తున్న సైబర్​ ముఠాలు జనాల్ని బురిడీ కొట్టించడానికి కొత్త కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. తాజాగా వెబ్​సైట్​, వాట్సాప్​ ద్వారా లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

లోన్‌లు, కార్డులు అంటూ ఆశలు చూపుతూ లింకులు పంపిస్తున్నారు. ఏదో వచ్చింది కదా అని ఆశతో లింకు ఓపెన్‌ చేస్తే.. క్షణాల్లో ఫోన్‌ ద్వారా డేటా తస్కరిస్తున్న సైబర్‌ మోసగాళ్లు అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు.

వడ్డీ లేని రుణం, తక్కువ వడ్డీ మీద లోన్‌, మీకు లాటరీ వచ్చింది, ఆదాయపు పన్ను రిటర్న్స్​లో తేడా ఉంది వంటి వివిధ సాకులతో వాట్సప్​, మెయిల్‌ ద్వారా లింకులు పెడుతున్నారు. అలాంటి లింక్‌లను కలిగి ఉన్న మెయిల్‌లు, వాట్సప్​లను చాలా సందర్భాల్లో క్లిక్‌ చేయడంతో మన సెల్, కంప్యూటర్లలోకి చొరబడుతున్నారు.

ఈ లింక్​లు క్లిక్‌ చేసి ఇప్పటికే ఎంతోమంది ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు తస్కరించడానికి సైబర్‌ మోసగాళ్లు ఇలాంటి సందేశాలను పంపి వల వేస్తున్నారు.

ఇలాంటి మెయిల్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేస్తే అందులో ట్రోజన్‌ వైరస్‌ లేదా మాల్వేర్‌ వంటి హానికరమైన ఫైళ్లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయ్యే ప్రమాదముంది.

ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఉత్తర భారతంలో అధికంగా చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ సైబర్‌ క్రైంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. నమోదైన కేసుల్లో ఓ వ్యాపారి అనుకోకుండా లింక్‌ క్లిక్‌ చేయగా మరుసటి రోజు అతడి అకౌంట్‌లోంచి డబ్బులు మాయమయ్యాయి.