బీహార్ ఎన్నికల సరళి ఎలా ఉందంటే…

By udayam on October 28th / 8:45 am IST

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సందర్భంగా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతి

బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణ కుమార్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258లో ఆయన ఏజెంట్‌గా ఉన్నారు.

పోలింగ్ బూత్‌లో కూర్చోగానే అకస్మాత్ముగా ఛాతీలో నొప్పి వచ్చిందని, చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మాస్క్ లేకుండా వచ్చి గొడవ పడ్డ ఓటరు..

కొంతమంది ఓటర్లు మాస్క్ పెట్టుకోకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో అధికారులు వారికి అభ్యంతరం చెబుతున్నారు. దీంతో చిన్నపాటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాసారామ్‌లో ఒక ఓటరు ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడు. పోలీసులు మాస్క్ పెట్టుకోవాలని సూచించగా, ఆ వ్యక్తి గొడవకు దిగాడు. పోలీసులు మాస్క్ గురించి అడగగా.. తాను మాస్క్ పెట్టుకునే బయటకు వచ్చానని, అయితే అది ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. దీంతో అతనికి… పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తరువాత పోలీసులే ఆ వ్యక్తికి మాస్క్ ఇచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఉత్సాహంగా వస్తున్న వృద్ధులు

కరోనా నేపథ్యంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినప్పటికీ, కొందరికి ఆ ఛాన్స్ రాలేదు. మొకామాలోని మకెరాకు చెందిన 80 ఏళ్ల కామేశ్వర్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ట్రై సైకిల్ మీద వచ్చి, మనుమని సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాబిర్ అలీ వృద్ధుడు కూడా పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేశారు. అలాగే భాగల్‌పూర్‌లో 80 ఏళ్ల యమునాశర్మ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.