ఇక అధికారికంగా బాల్ థాకరే జయంతి

By udayam on January 15th / 6:04 am IST

ముంబై: ఒకప్పుడు మహారాష్ట్రను శాసించిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేతో పాటు, ఆయన తండ్రి కేశవ్ సీతారాం థాకరే జయంతి ఉత్సవాలను ఇకపై అధికారికంగా నిర్వహించబోతున్నారు.

ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఈ ఇద్దరి పేర్లను చేర్చింది.

మొత్తం నలుగురు వ్యక్తుల పేర్లను కొత్తగా చేర్చుతూ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం జనవరి23న ప్రభుత్వ కార్యాలయాల్లో బాల్ థాకరే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు.

శివసేన, ఎన్సీపీ ,కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే నేతృత్వం వహిస్తున్ననేపథ్యంలో ఇందుకోసం జేఏడీ పోర్టిఫోలియోను బాల్ థాకరే కుమారుడు, మహారాష్ట్రసీఎం ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలోనే రూపొందించారు.

ఆయన తాత కేశవ్ సీతారాం థాకరే‌కి ‘‘ప్రబోధకార్’’ (సంస్కర్త)గా పేరుంది. సంస్కరణ వాదభావాలు, మతఛాందస వాదంపై పదునైన విమర్శ కారణంగా ఆయనకు ఈ గుర్తింపు లభించింది.

అయితే  బాల్ థాకరే మాత్రం హిందూత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. ‘‘ప్రతియేటా ఎవరెవరి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌లో జీవో విడుదల చేసింది.

2020 డిసెంబర్ 15న విడుదల చేసిన ఈ జీవోలో మొత్తం 37 పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను సవరించి మరో నాలుగు పేర్లను చేర్చినట్లు  అధికారులు వెల్లడించారు.

బాల్ థాకరే, కేశవ్ థాకరేలతోపాటు తొలి మరాఠీ వార్తాపత్రిక వ్యవస్థాపకుడు బాల్ ‌శాస్త్రి జంభేకర్, డాక్టర్ పంజాబ్రావు దేశ్‌ముఖ్‌ పేర్లుకూడా ఉన్నాయి. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో పంజాబ్రావు దేశ్‌ముఖ్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.