అమెరికాలోని కాంగ్రెస్ భవనాన్ని ముట్టడించి పలువురి మరణానికి కారణమైన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల్లా బెంగాల్ బిజెపి కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
‘‘ఏరోజైతే వారు ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోతారో అప్పుడు వారు కూడా ట్రంప్ మద్దతు దారుల్లానే వ్యవహరిస్తారు జాగ్రత్త” అంటూ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురుకావడం తథ్యమని సర్వేలు చెబుతుండడంతో మమతా బెనర్జీ బిజెపిపై ప్రతి చోటీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
‘‘ప్రస్తుతం బిజెపి ని చూస్తుంటే వివిధ పార్టీలలో అవినీతి చేసిన వారికి ఆశ్రయం కల్పించే చోటులా కనిపిస్తోంది” అంటూ విమర్శించారు.
‘‘తృణమూల్ నుంచి బిజెపి లోకి చేరిన వారంతా ప్రజా సొమ్మును దోచుకుతిన్న వారే. వారిని రక్షించడమే ఇప్పుడు బిజెపి లక్ష్యం. అలాంటి వారికి అధికారమిస్తే ఇక అభివృద్ధి శూన్యం” అంటూ ఘాటుగానే స్పందించారు.