ఆర్ ఆర్ ఆర్ సినిమా పై రాజమౌళికి బిజెపి ఎంపీ వార్నింగ్

By udayam on October 27th / 11:30 am IST

ఆదిలాబాద్ జిల్లా: ఆర్ ఆర్ ఆర్ మూవీ పై ఓపక్క భారీ అంచనాలుండగా, మరోపక్క విడుదలకు ముందే ఈ సినిమా వివాదం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో కొమరం భీం పాత్ర పోషిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ పై దుమారం రేగుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో భీమ్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఈ నెల 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది.

అందులో భీమ్ టకియాను ధరించడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చిరస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాపు రావు రియాక్ట్ అవుతూ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని సూచించారు.

ఒకవేళ అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని ఎంపీ హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమ న్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ ఫైర్ అయ్యారు.