ఈసారి బడ్జెట్ డిజిటల్ కాపీలతోనే సరి!

By udayam on January 12th / 12:35 pm IST

న్యూడిల్లీ: కరోనా నిబంధనల నేపథ్యంలో ఎన్నో రంగాల్లో చాలా మార్పులు వచ్చేసాయి. ఇక పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే శీతాకాల సమావేశాలు జరగలేదు.

ఇక పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సారి బడ్జెట్‌ ముద్రణ చేయరాదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 1947, నవంబర్ 26న తొలిసారిగా స్వతంత్ర భారత పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తరువాత ఇలా ప్రతులు లేకుండా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే కానుంది.

2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కాపీలను డిజిటల్‌గానే వారికి అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్‌, ఎకానమిక్‌ సర్వే డిజిటల్‌ కాపీలను అందించనున్నారు.

సాధారణంగా పార్లమెంట్ బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేసి, నార్త్‌ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్‌ ప్రింటింగ్‌ కోసం వినియోగిస్తారు.

ఇక డాక్యుమెంట్ ‌లు ముద్రించి, సీల్‌ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబా నికి దూరంగా ఇక్కడే ఉంటారు.

ఇక భారీ స్థాయిలో సిబ్బంది కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఇలా ఒకే చోట ఎక్కువమంది ఉంచడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కావడం, కోవిడ్‌-19 భయాలు, కొత్త స్ట్రెయిన్‌‌ కలకలంతో బడ్జెట్‌ కాపీలను ప్రింట్‌ చేయడం లేదని అధికారులు తెలిపారు.

ఇక రికార్డులను డిజిటలైజ్‌ చేయాలని పార్లమెంట్ ఎన్నో ‌ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కరోనా వలన అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్‌ చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏటా బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించే ‘హల్వా వేడుక’ ఉంటుంది. ఈసారి అది కూడా కేన్సిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.