కృష్ణంరాజుకు గవర్నర్ గిరీ ఖాయమా

By udayam on January 11th / 6:05 am IST

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు గవర్నర్‌ పదవి రాబోతోందా? గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన అంటూ రాలేదు.

అయితే తమ అభిమాన హీరో ప్రభాస్ పెద్ద నాన్నకు గవర్నర్‌ పదవి దక్కనుందన్న వార్తల ప్రచారంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

2016లో రోశ‌య్య వెళ్లిపోయిన త‌ర్వాత, అప్పటి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ ఉన్న విద్యాసాగ‌ర్ రావే కొన్నాళ్ళు త‌మిళ‌నాడుకు గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వహిం‍చారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా తిరు బన్వారిలాల్ పురోహిత్‌ ఉన్నారు.

అయితే దక్షిణాదిన ముఖ్యంగా త్వరలో త‌మిళ‌నాడులో జరగబోయే ఎన్నికల్లో పాగా వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. అందులో భాగంగానే కృష్ణంరాజును గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని నిర్ణ‌యించింద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అంటున్నారు.

కృష్ణంరాజు రాజకీయ జీవితం

కృష్ణంరాజు 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు, 1999లో నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.