కేంబ్రిడ్జ్ అనలిటికాపై సిబిఐ కేసు

ఫేస్‌బుక్‌ డేటా చోరీ కేసు

By udayam on January 22nd / 6:19 am IST

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కేసులో కేంబ్రిడ్జ్ అనలిటికాపై శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కేసు నమోదు చేసింది.

దాదాపు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో కేసు నమోదైంది.

యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసిన సిబిఐ.. ఇదే ఆరోపణలతో అదే దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చడంతో ఫేస్‌బుక్‌ కూడా స్పందించింది.

దాదాపు 5.62 లక్షల భార‌తీయ యూజ‌ర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబ‌ల్ సైన్స్ కంపెనీ ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అన‌లిటికాతో పంచుకుందని ప్రకటించింది.

తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయనుందని కేంద్రఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించగా, శుక్రవారం కేంద్రమంత్రి ఇదే విషయాన్ని మరోసారి పునురుద్ఘాటించారు.