‘పల్లె ప్రగతి – పంచ సూత్రాలు’

టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు

By udayam on January 28th / 1:24 pm IST

అమరావతి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు.

ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తామని,  భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తామని, ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని, స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా..వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటామని, ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తామని   చంద్రబాబు వివరించారు.

భయపెట్టి ఏకగ్రీవాలా ?

వైకాపా చెబుతున్నట్లు పంచాయితీలు ఏకగ్రీవాలు నిజమైన ఏకగ్రీవం కాదని, భయపెట్టి, బలవంతంగా ఏకగ్రీవం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఒకటి రెండు కాకుండా ఏకంగా 2,274పంచాయితీలను ఏకగ్రీవం చేసారని ఆయన పేర్కొంటూ ఈ సందర్బంగా జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.