ఫిషింగ్‌ హార్బర్లకు జగన్ ‌శంకుస్థాపన

By udayam on November 21st / 7:53 am IST

అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టును ఎపి ప్రభుత్వం చేపట్టింది.

తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ వర్చువల్‌ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు.

వీటితో పాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో 974 కి.మీ తీరప్రాంతం ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు.

మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం,  సరైన సౌకర్యాలు లేక గుజరాత్‌లాంటి ప్రాంతాలకు వలస పోవడం పాదయాత్రలో చూశానని ఆయన గుర్తుచేసుకున్నారు.

పెద్ద సముద్రతీరం ఉన్నా అవసరమైన ఫిషింగ్‌ హార్బర్లు లేవని, మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అయన తెలిపారు.

మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మించడంతో పాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు.

జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తామని  మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడతామని వివరించారు.