పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్

సీఎం రాజీనామా

By udayam on February 22nd / 2:37 pm IST

చెన్నై: రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగి చివరకు బల నిరూపణలో సీఎం నారాయణస్వామి సర్కార్‌ విఫలమయ్యింది. ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మీద ఆయన నిప్పులు చెరిగారు.

కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని నారాయణస్వామి ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగుతుండగా, గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్‌ తిగురుబావుటా ఎగురవేశారు.

అప్పటినుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు ఉండాల్సి ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది.

ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్‌ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్‌ రాజీనామా, తాజాగా నేడు బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలమవడంతో ఆయన రాజీనామా చేశారు.