3:55 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ముఖ్యమైన కేసులు లైవ్ టెలికాస్ట్ ద్వారా విచారించాలి :ఉండవల్లి 2 weeks ago

తూర్పుగోదావరి : ఏపీలో రాజకీయ నాయకులపై కేసుల విచారణ లైవ్ టెలికాస్ట్ ద్వారా నిర్వహించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈమేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు. రాజమండ్రి లో శనివారం మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే వర్చువల్ విధానంలో విచారణ చేస్తున్నారని గుర్తుచేశారు. కొన్ని దేశాల్లో ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్ విధానం ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో కూడా ముఖ్యమైన కేసుల విషయంలో ఇలా చేస్తే, అసలు కేసుల విచారణ ఎలా జరుగుతోంది.. తీర్పులు ఎలా వెల్లడిస్తున్నారు… వంటి విషయాలు ప్రజలకు తెలియడానికి వీలవుతుందని, దీనివలన తప్పుడు సంకేతాలు వెళ్ళడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదని ఆయన విశ్లేషించారు.

జగన్ పై ఉన్న కేసులు అలాగే చంద్రబాబుపై ఉన్న కేసులు విచారణ నేపథ్యంలో అసలు జరిగింది జరిగినట్టు చూసే వీలు ‘లైవ్ టెలికాస్ట్’ వలన ఉంటుందని ఉండవల్లి పేర్కొన్నారు. లేకపోతె మీడియాలో ఒక్కొక్క దానిలో ఒక్కోలాగా వస్తోందని, ఏది నమ్మాలో తెలియడం లేదని, ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఎవరికివాళ్లు కామెంట్లు చేస్తున్నారని ఆయన పేర్కొంటూ అందుకే లైవ్ టెలికాస్ట్ వలన వాస్తవాలు అందరికీ తెలుస్తాయని వివరించారు. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. లైవ్ టెలికాస్ట్ కి అయ్యే ఖర్చు భరించడానికి కూడా చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తారని ఆయన చెప్పారు. పైగా దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు కనుక కోర్టు ద్వారానే ఏర్పాటు కూడా చేయవచ్చని ఆయన అన్నారు.

కాగా సుప్రీం కోర్టు జడ్జిపై జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ సలహాదారు ద్వారా వెల్లడించి ఉంటారని ఉండవల్లి అభిప్రాయ పడ్డారు. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని , లేదంటే విచారణ జరిపించేలా చేయొచ్చని అన్నారు. గతంలో సీఎం గా ఉన్న దామోదరం సంజీవయ్య ఓ జడ్జి విషయంలో ఇలాగే లేఖ రాసారు. అయితే అప్పట్లో సీఎం, గవర్నర్, జడ్జి ఇలా అందరూ తమ తమ హోదాలను హుందాతనంగా నిర్వహించారు. అలాగే గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని,అయితే ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీయార్ పాలన సాగించారని గుర్తుచేశారు.