అవును ఆ వ్యాఖ్యలు నిజమే

సిరాజ్​, బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న క్రికెట్​ ఆస్ట్రేలియా

By udayam on January 27th / 9:28 am IST

ఈ నెల మొదట్లో సిడ్నీ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా – భారత్​ మూడో టెస్ట్​ 4వ రోజు ఆటలో భారత ఆటగాళ్ళపై తమ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై క్రికెట్​ ఆస్ట్రేలియా విచారణ జరిపింది. ఈ విచారణలో స్టేడియంలోని అభిమానులు క్రికెటర్లపై ఆ వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారించింది.

బౌండరీల వద్ద ఫీల్డింగ్​ కాస్తున్న భారత క్రికెటర్లైన మహ్మద్​ సిరాజ్​, జస్ప్రీత్​ బుమ్రాలపై కొందరు ఆసీస్​ అభిమానులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని క్రికెట్​ ఆస్ట్రేలియా సెక్యూరిటీ అధికారి షాన్​ కారోల్​ ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశాడు.

అభిమానుల వ్యాఖ్యలపై అప్పటికప్పుడే గ్రౌండ్​లోని అంపైర్లకు తెలిపిన సిరాజ్​.. అనంతరం గ్రౌండ్​లోని పోలీసుల సహాయంతో ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానుల్ని బయటకు పంపించిన విషయం తెలిసిందే.

సిసిటివి ఫుటేజ్​లను పరీశీలించడం, టికెటింగ్​ డేటాను తనిఖీ చేసిన అనంతరం ఓ ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానుల్ని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. అయితే ఇలా వ్యాఖ్యలు చేసిన మరికొందర్ని సైతం విచారించడానికి ప్రయత్నిస్తున్నామని, వారి జాడ కనిపెట్టలేకపోయినట్లు తెలిపారు.