సోనియా.. మీరు ఢిల్లీని వదిలేయండి

ఆరోగ్యం కుదుటపడే వరకూ ఢిల్లీ కాలుష్యానికి దూరం కావాలన్న డాక్టర్లు

By udayam on November 20th / 2:07 pm IST

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆమె డాక్టర్లు ఢిల్లీని వదిలి కొద్ది కాలం దూరంగా ఉండాలంటూ సలహా ఇచ్చారు. దేశ రాజధానిలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఆమె ఛాతీలో ఉన్న ఇన్ఫెక్షన్​కు ఇబ్బందులు తలెత్తుతాయని కొద్ది కాలం పాటు ఢిల్లీని వదిలేయాల్సిందిగా వారు సోనియాకు సూచించారు.

దీంతో సోనియా గోవాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోనియాతో పాటు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం గోవాకు వెళ్ళనున్నారు.

ఈ ఏడాది ఆగస్ట్​లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఛాతీలో ఉన్న ఇన్ఫెక్షన్​ తగ్గకపోవడంతో ఆమెను ఢిల్లీకి దూరంగా ఉంచాలని డాక్టర్లు సోనియా కుటుంబ సభ్యులకు సూచించారు.

అయితే ఢిల్లీలో గాలి నాణ్యత శుక్రవారం ఉదయం 305 గా రికార్డయింది. అంటే ‘అత్యంత ఘోరం’ అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.