ఇద్దరు జమ్మూ రైతు నేతల అరెస్ట్

By udayam on February 23rd / 6:26 am IST

న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట హింసాకాండ కేసులో నిందితులైన ఇద్దరు జమ్మూ రైతు సంఘం నేతలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోటలో హింసాకాండ చెలరేగిన సంగతి తెల్సిందే.

ఎర్రకోట ఘటనలో నిందితుడైన జమ్మూకశ్మీర్ యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్(45), జమ్మూకు చెందిన మన్‌దీప్ సింగ్ (23)లను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి వారిని ప్రశ్నించేందుకు ఢిల్లీకి తరలించారు.

ఎర్రకోట ఘటనలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారని ఢిల్లీ పోలీసు అదనపు ప్రజాసంబంధాల అధికారి అనిల్ మిట్టల్ చెప్పారు.

తనభర్త నిర్దోషి – ర్యాలీకి వెళ్ళలేదు

తన భర్త ఎర్రకోటకు వెళ్లలేదని, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనలో పాల్గొన్నాడని, అయితే పోలీసులు విచారణ పేరిట పిలిచి అరెస్టు చేశారని మోహిందర్ సింగ్ భార్య ఆరోపించారు.

తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎర్రకోటపై మత జెండాలు ప్రదర్శించిన మన్ దీప్ సింగ్ ను మంగళవారం అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.