ఇకపై గూగుల్​ ఫొటోస్​ ఫ్రీ కాదు

2021 జూన్​ నుంచి 15 జిబి స్టోరేజ్​ మాత్రమే

ఆపై స్టోరేజ్​ను కొనుగోలు చేయాల్సిందే

By udayam on November 13th / 2:59 am IST

ఇప్పటికే 5 సంవత్సరాలుగా గూగుల్​ ఫొటోస్​ సేవలను ఉచితంగా అందిస్తున్న గూగుల్​ ఇకపై ఆ సర్వీసును సైతం ప్రీమియం చేయనున్నట్లు తన బ్లాగ్​లో వెల్లడించింది. అన్​లిమిటెడ్​ ఫ్రీ ఫొటో బ్యాకప్​ను హై క్వాలిటీ రిజల్యూషన్​తో గూగుల్​ పొటోస్​ యాప్​ ద్వారా ఉచితంగా వాడుకుంటున్న గూగుల్​ వినియోగదారులకు ఇది నిజంగా చేదు వార్తే.

గూగుల్​ కొత్త పాలసీలో ఏముంది?

వచ్చే ఏడాది జూన్​ 1 నుంచి గూగుల్​ డ్రైవ్​ పాలసీలో మార్పులు చేస్తున్న గూగుల్​ ఫొటో స్టోరేజ్​ 15 జిబి దాటితే ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.

జూన్​ 1, 2021 కు ముందు మీ గూగుల్​ స్టోరేజ్​లో ఎంత వరకూ ఉందో ఆ స్టోరేజ్​ లెక్కలోకి రాదు. జూన్​ 2 నుంచి మీరు అప్​లోడ్​ చేసే ఫొటోలకు మాత్రమే ఈ స్టోరేజ్​ ఆప్షన్​ లెక్కలోకి వస్తుంది. అంటే జూన్​ 1, 2021 వరకూ మీ గూగుల్​ ఫొటోస్​ స్టోరేజ్​ 50జిబి దాటేసినా మీరు దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే జూన్​ 2, 2021 నుంచి మాత్రం 15 జిబి స్టోరేజ్​ కౌంట్​ మొదలవుతుందన్న మాట.

దీంతో పాటు రెండేళ్ళ నుంచి ఉపయోగించకుండా ఉన్న జిమెయిల్​ ఎకౌంట్లను సైతం పూర్తిగా తొలగించనుంది.

అయితే ఈ 15జిబి లిమిట్​ ఆప్షన్​ మాత్రం గూగుల్​ పిక్సెల్​ మొబైల్స్​ వాడే యూజర్లకు ఉండదని గూగుల్​ తెలిపింది. గూగుల్​ ఫోన్లను వాడే యూజర్లకు ఎప్పటిలాగే అన్​లిమిటెడ్​ గూగుల్​ ఫొటోస్​ సర్వీస్​ను ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపింది.

‘‘ఇప్పటికే మేం ప్రపంచంలోని మిగతా కంపెనీల కంటే అధికంగా ఫ్రీ స్టోరేజ్​ను అందిస్తున్నాం. యాప్​ స్టోర్​ కేవలం 5జిబి ఫ్రీ స్టోరేజ్​ను మాత్రమే అందిస్తోంది. మేం 15 జిబి అందిస్తున్నాం. మా ఆండ్రాయిడ్​ యూజర్లు 15 జిబి ఫ్రీ స్టోరేజ్​ను మొత్తంగా వినియోగించడానికి దాదాపు 3 ఏళ్ళ సమయం పడుతుంది. అది వారికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం” అని గూగుల్​ ప్రకటన విడుదల చేసింది.

“మా గూగుల్​ ఫొటోస్​లో ఇప్పటికే 4 ట్రిలియన్ల (4 లక్షల కోట్లు) ఫొటోస్​ను ఆండ్రాయిడ్​ యూజర్లు స్టోర్​ చేశారు. ప్రతీ వారం 28 బిలియన్ల కొత్త ఫొటోలు, వీడియోస్​ను అప్​లోడ్​ చేస్తున్నారు. దీంతో ఈ సర్వీస్​ను మేం మరింత బలంగా నిర్వహించాల్సిన అవసరం మాకు కనిపిస్తోంది. అందుకు ఈ సర్వీస్ నిర్వహణకు నిధుల అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణం చేతనే మేం ప్రీమియం సర్వీసుకు మారాలనుకుంటున్నాం” అని గూగుల్​ ప్రకటనలో వెల్లడించింది.