బిగ్ బాస్ చూస్తూ.. బ్రెయిన్ ఆపరేషన్

By udayam on November 21st / 6:23 am IST

గుంటూరు: బిగ్‌బాస్‌ రియాల్టీ షో చూస్తూ ఓ వ్యక్తి ఏకంగా బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. రోగికి అత్యాధునిక వైద్య విధానం న్యూరో నావిగేషన్‌తో అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషంగా వైద్యులు చెప్పారు. గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్‌లో మీడియాకు  వివరాలను వెల్లడించారు.

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బత్తుల వరప్రసాద్‌ బెంగళూరులో స్టాఫ్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తలలో ట్యూమర్‌ ఏర్పడి ఫిట్స్‌ రావటంతో 2016లో హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. సర్జరీ అనంతరం రేడియోథెరపీ కూడా చేశారు.

అయితే బ్రెయిన్‌లో మళ్ళీ  గడ్డ ఏర్పడి సుమారు ఆరు నెలలుగా ఫిట్స్‌ వచ్చి తరచూ పడిపోతుండడంతో క్యాన్సర్‌ వైద్య నిపుణుల సూచనల మేరకు నవంబర్‌ 6న ఆస్పత్రికి వచ్చాడు.

రోగి తలకు ఎంఆర్‌ స్పెక్ట్రో స్కోపీ, పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ చేసి ప్రధానమైన పెద్ద రక్తనాళం పక్కన ప్రీ మోటార్‌ ప్రాంతంలో ట్యూమర్‌ ఉన్నట్టు గుర్తించారు.

ఈ నెల 10న న్యూరో నావిగేషన్, మోడరన్‌ మైక్రోస్కోప్‌ వినియోగించి త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్‌ చేసారు. ఆపరేషన్‌ సమయంలో రోగికి బిగ్‌బాస్‌ షో చూపిస్తూ ఉండగా హీరో నాగార్జున పాటలను రోగి పాడుతూ ఉన్నట్టు తెలిపారు.

రోగికి ఇష్టమైన అవతార్‌ సినిమా చూపిస్తూ, రోగితో మాట్లాడుతూ ఆపరేషన్‌ చేశారు. బ్రెయిన్‌లో నుంచి మూడు సెంటీమీటర్ల ట్యూమర్‌ను తీసే సమయంలో మెడ వెనుక ఏదో తేడా వస్తున్నట్టు చెప్పడంతో, వెంటనే వేరే డైరెక్షన్‌లో బ్రెయిన్‌లో నుంచి ట్యూమర్‌ను బయటకు తీసి రోగి ప్రాణాలు కాపాడారు. సుమారు గంటన్నర వ్యవధిలో జరిగిన శస్త్రచికిత్స చేసారు.