4:35 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

కోస్తాలో మళ్ళీ భారీ వర్షాలు  2 weeks ago

అమరావతి: ఇప్ప్పటికే అల్ప పీడనాలు, వాయుగుండాల కారణంగా అతలాకుతలమైన కోస్తాకు మరోమారు భారీవర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలో అధిక వర్షాలతో రాష్ట్రంలోని  ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పలు ప్రాజెక్ట్‌లకు ఇన్‌ఫ్లో అత్యధికంగా వచ్చి చేరుతోంది. అయితే ఈ నెల 19న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 24 గంటల్లో బలపడుతుంది.

అయితే ఇది వాయుగుండం/తీవ్ర వాయుగుండంగా మారుతుందా? లేదా? అనేది వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు.
అయితే  17న కోస్తా, యానాం ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, ఈ నెల 18,19,20 తేదీల్లో కోస్తా, ఒడిసాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రభుత్వం, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద మూడవ హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 8 లక్షల 50 వేల క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 8 లక్షల 45 వేల క్యూసెక్కులగా ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు సాగు నీటి అవసరాల కోసం 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని  విడుదల చేశారు. కాగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో  5,62,850 క్యూసెక్కులుగా ఉండడంతో అధికారులు జలాశయం 10 గేట్లను 25 అడుగుల మేరకు  ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 5 లక్షల 94 వేల 042 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 211.9572 టీఎంసీలుగా నమోదు అయ్యింది.