హీరో F6i సైకిల్ @ 49వేలు

By udayam on December 27th / 9:54 am IST

న్యూఢిల్లీ: ఒకప్పుడు సైకిల్ అంటే సామాన్యుడి వాహనం. అద్దెకు సైకిళ్ళు కూడా ఇచ్చేవారు. రానురాను అందరూ మోటార్ బైక్ లు, కార్లకు అలవాటు పడుతున్నారు.

అయినా కొందరు సైకిళ్ళు వాడుతూనే ఉన్నారు. 4,5వేలకు దొరికే హీరో  సైకిల్ ఇప్పుడు సెలబ్రిటీ స్థాయికి తగ్గ ధరల్లో  సైకిళ్ళు రూపొందించింది. అందులో భాగంగా హీరో సైకిల్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్‌ ఖరీదు అక్షరాలా  రూ. 49వేలు.

హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. F6i సైకిల్‌ రెండు కలర్‌ కాంబినేషన్స్‌లో అంటే.. రెడ్‌ విత్‌ బ్లాక్‌, యెల్లో విత్‌ బ్లాక్‌ లభిస్తోంది. F6i సైకిల్‌ వెనుక హబ్‌కు 36v/250w సామర్థ్యంగల మోటార్‌ను అమర్చారు.

ఇందుకు అనుగుణంగా 36v లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీను ఏర్పాటు చేశారు. విడదీసేందుకు వీలైన ఈ బ్యాటరీని 5-6 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ చేయవచ్చట.

అలాయ్‌ ఫ్రేమ్‌తో రూపొందిన F6i ఎలక్ట్రిక్‌ సైకిల్‌కు ముందు భాగంలో 60ఎంఎం ఫోర్క్‌లు, వెనుక డ్యూయల్‌ డిస్క్‌ బ్రేకులను అమర్చారు. ముందు, వెనుక భాగంలో లైట్లు, లెడ్‌ డిస్‌ప్లేలతో సైకిల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్‌బీ చార్జింగ్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ లాకింగ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ సౌకర్యాలను సైతం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

సైకిల్‌కు అమర్చిన 7 స్పీడ్‌ షిమానో ఆల్టస్ సహాయంతో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చట. కొద్ది రోజులుగా హైఎండ్‌ బైకింగ్‌ విభాగంలో భారీ డిమాండు నెలకొన్నదని, సరైన తరుణంలో ఆధునిక సాంకేతికలతో కూడిన సైకిల్‌ను ప్రవేశపెట్టామని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్​