గ్రేటర్ లో ముగిసిన నామినేషన్లు

By udayam on November 20th / 1:55 pm IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికి పైగా ఉంటాయని అధికారుల అంచనా.

శనివారం నామినేషన్ల పరిశీలిస్తారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పుడే నికర అభ్యర్థులు తేలనున్నారు.

ఇంకా విత్ డ్రా లోగా బిఫార్మ్స్ ఇవ్వడానికి సమయం ఉన్నందున ఈలోగా అసంతృప్తులకు బి ఫార్మ్స్ ఇచ్చేలా కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

పరిశీలకులుగా 5గురు ఐఏఎస్ లు

ఇక ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శిఖా గోయల్ (ఈస్ట్‌ జోన్), అనిల్‌కుమార్ (వెస్ట్ జోన్), చౌహన్ (సౌత్ జోన్), అవినాష్ మొహంతి (నార్త్‌ జోన్), తరుణ్‌ జోషి (సెంట్రల్ జోన్)లను నియమించారు.

భారీ బందోబస్తు

సీపీ సజ్జనార్‌ శుక్రవారం గ్రేటర్‌ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. 2,569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సైబరాబాద్‌ పరిధిలో 770 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

ప్రతి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌కి ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. ఇప్పటివరకు రూ.62.21 లక్షల నగదు సీజ్ చేయగా, 11 ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.