నా ప్రవర్తనపై సిగ్గుపడుతున్నా : టిమ్​ పైన్​

ఆస్ట్రేలియా కెప్టెన్​ మ్యాన్​ ఫీజులో 15 శాతం కోత

By udayam on January 11th / 1:24 pm IST

సిడ్నీ వేదికగా భారత్​తో జరుగుతున్న మూడో టెస్టులో ఎంతకీ వికెట్​ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న అశ్విన్​, హనుమ విహారిలపై ఆస్ట్రేలియా కెప్టెన్​ స్లెడ్జింగ్​కు పాల్పడ్డాడు. దీంతో ఐసిసి అతడి మ్యాచ్​ ఫీజ్​లో 15 శాతం కోత విధించింది.

దీనిపై మ్యాచ్​ ముగిసిన అనంతరం పైన్​ స్పందించాడు. ఈరోజు మైదానంలో తన ప్రవర్తనపై సిగ్గుపడుతున్నట్లు విలేకరుల వద్ద చెప్పాడు. ‘‘నేను టివి చూస్తున్న చిన్నారులకు రోల్​ మోడల్​లా ఉండాల్సింది. కానీ నా ప్రవర్తన ఈరోజు అత్యంత దారుణంగా ఉంది. అశ్విన్​తో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు” అని వాపోయాడు.

అశ్విన్​తో జరిగిన సంభాషణలో ‘‘నీతో గబ్బా టెస్ట్​ ఆడడానికి తొందర పడుతున్నా. ఈరోజు కొంచెం ఫాస్ట్​గా ఆడొచ్చుగా” అని పైన్​ కవ్వించాడు.

దీనికి అశ్విన్ సమాధానం ఇస్తూ.. ‘‘నువ్వు కూడా భారత్​ వచ్చి ఆడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అది నీకు ఆఖరి టెస్ట్​ అవుతుంది” అని గట్టిగానే బదులిచ్చాడు.

దీనిపై మ్యాచ్​ అనంతరం మాట్లాడిన పైన్​.. తాను కావాలని ఆ మాటలు మాట్లాడలేదని.. మ్యాచ్​ జరుగుతున్నంత సేపు తన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.