కరోనా టీకా బూస్టర్ డోస్ కోసం తెలంగాణలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. చైనాలో లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడుతూ, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఐసీయూల్లో చేరుతుండడం, కేంద్ర సర్కారు ముందస్తు హెచ్చరికలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదనే ఆలోచనతో ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసుపత్రులకు వస్తున్నారు. గడిచిన 72 గంటల్లో బూస్టర్ డోస్ కోసం వచ్చే వారి సంఖ్య.. అంతకుముందు రోజువారీ సగటుతో పోలిస్తే 400 శాతం పెరిగినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.