భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం

By udayam on October 27th / 10:55 am IST

న్యూఢిల్లీ : భారత్‌-అమెరికాల మధ్య మంగళవారం ప్రారంభమైన మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్‌ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్‌ పొందే వెసులుబాటు కలుగుతుంది.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. సమావేశాల్లో సమగ్ర, ఫలవంతమైన చర్చలు జరిపామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి గా అభివర్ణించారు. భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు.