బ్రిస్బేన్​ టెస్ట్​కు జడ్డూ దూరం

గాయంతో సిరీస్​ నుంచి వైదొలగిన ఆల్​రౌండర్​

బుమ్రా సైతం అనుమానమే

By udayam on January 12th / 6:28 am IST

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్​ – గవాస్కర్​ సిరీస్​లో భారత్​ను గాయాల బెడద వదలడం లేదు.

ఇప్పటికే కీలక ఆటగాళ్ళైన కెఎల్​ రాహుల్​, ఉమేష్​ యాదవ్​, మహ్మద్​ షమిలు సిరీస్​కు దూరమవ్వగా ఇప్పుడు మరో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా సిరీస్​కు దూరమయ్యాడు.

సిడ్నీ నుంచి భారత్​కు బయల్దేరి బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీలో శిక్షణ తీసుకోనున్నాడు జడేజా.

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్​ మొదటి ఇన్నింగ్స్​లో స్టార్క్​ బౌలింగ్​లో దూసుకొచ్చిన బౌన్సర్​ ఆడబోతూ జడేజా ఎడమ చేతి బొటన వేలికి గాయం అవ్వడంతో భారత్​ తొలి ఇన్నింగ్స్​ ముగిసిన అనంతరం అతడిని స్కానింగ్​కు పంపిన విషయం తెలిసిందే.

అయితే రెండో ఇన్నింగ్స్​లో అతడు పెయిన్​ కిల్లర్స్​ వాడి బ్యాటింగ్​కు సిద్దపడినా మరో వికెట్​ పడకపోవడంతో ఆ అవకాశం రాలేదు.

దీంతో నాలుగో టెస్ట్​ నుంచి అతడిని తొలగించి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సిడ్నీ టెస్టులో మరో ఇద్దరు భారత ఆటగాళ్ళు సైతం గాయాలపాలైన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయంతో హనుమ విహారి బాధపడుతుండగా, వెన్నునొప్పితో స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ సైతం బాధపడుతున్నాడు.