బీహార్ లో కాల్పుల కలకలం

ఇండిగో మేనేజర్ హత్య

By udayam on January 13th / 7:17 am IST

పాట్నా: గోవాలో కుటుంబసభ్యులతో సరదాగా గడిపి బిహార్‌ చేరుకున్న ఇండిగో పాట్నా మేనేజర్‌ రూపేష్‌ కుమార్‌ను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా బిహార్‌ ఉలిక్కిపడింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నితీశ్‌ కుమార్‌పై మండిపడు తున్నారు.

పాట్నా పునాయ్‌చక్‌లోని కుసుమ్‌ విలాస్‌ అపార్ట్‌మెంట్‌లో రూపేశ్‌ నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 7గంటలకు బయటకు రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు తుపాకీ తీసి రూపేశ్‌పై  ఏకంగా ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్ర గాయాలైన ఆయన్ని  ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ ఘటన రాజకీయం పులుపుకుంది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ తీవ్రస్థాయిలో నితీశ్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ హంతకుల చేతిలో రాష్ట్రం ఉందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న నేరస్తులే రూపేశ్‌ను హతమార్చారని ఆరోపించారు. హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పూ యాదవ్‌ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు.