అందరి చూపూ.. వీరి వైపు..

స్మిత్​, డేవిడ్​ మలన్​, మ్యాక్స్​వెల్​, శ్రీశాంత్​లు ప్రత్యేక ఆకర్షణ

ఐపిఎల్​ మినీ వేలంలో వీరిదే హవా

By udayam on January 23rd / 10:24 am IST

రాబోయే ఐపిఎల్​ సీజన్​ కోసం ఫిబ్రవరిలో ఆటగాళ్ళ కోసం మినీ వేలం నిర్వహించడానికి బిసిసిఐ సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తాము వదిలేసిన ఆటగాళ్ళ జాబితాను బిసిసిఐకు సమర్పించింది. అయితే వీరిలో చాలా మంది సీనియర్​ ఆటగాళ్ళు ఉండడంతో వీరికి భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

స్టీవ్​ స్మిత్​

రాజస్థాన్​ రాయల్స్​లో అత్యంత సీనియర్​ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్​ అయిన స్టీవ్​ స్మిత్​ను ఈసారి వేలానికి వదిలేసింది. దీంతో ఇతడిని దక్కించుకోవడానికి మిగతా జట్లు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​, రాయల్​ ఛాలెంజర్స్​ ఇతడిని దక్కించుకోవడానికి ఆశక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్లతో పాటు రాజస్థాన్​ కూడా అతడిని తక్కువ ధరకే దక్కించుకోవాలని చూస్తుండగా.. చెన్నై కూడా అదే ఆలోచన చేస్తోంది.

మిచెల్​ స్టార్క్​

2018లో ఈ స్టార్​ ఫాస్ట్​బౌలర్​ను 9.4 కోట్ల భారీ ధరతో దక్కించుకున్న కోల్​కత్తా అతడికి గాయం అవడంతో గత రెండు సీజన్లలోనూ ఆడించలేకపోయింది. దీంతో అతడిని ఈసారి వేలానికి వదిలేసింది. ముంబై, పంజాబ్​ జట్లు అతడిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

కైల్​ జెమీసన్​

న్యూజిలాండ్​ అద్భుత ఆల్​రౌండర్​ అయిన ఇతడిపై ముంబై, పంజాబ్​ కన్నేశాయి. రాజస్థాన్​ సైతం ఇతడిని ఎంత ధర పెట్టైనా తీసుకోవాలని చూస్తోంది. దీంతో ఇతడికి అత్యధిక ధర పలికే అవకాశం అందరికంటే ఎక్కువగా ఉన్నాయి.

గ్లెన్​ మ్యాక్స్​వెల్​

గత సీజన్​లో ఏకంగా 10.75 కోట్లకు పంజాబ్​ కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా భీకర బ్యాట్స్​మెన్​ గ్లెన్​ మ్యాక్స్​వెన్​ 2020 సీజన్​లో పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని వేలానికి వదిలేసింది పంజాబ్​. అయితే ఇతడిపై బెంగళూరు, రాజస్థాన్​ జట్లు కన్నేశాయి.

ఆరోన్​ ఫించ్​

ఇప్పటి వరకూ ఆరు ఐపిఎల్​ జట్లతో సహవాసం చేసిన ఆరోన్​ ఫించ్​ను బెంగళూరు గత సీజన్​ ఆడించినా అతడిని ఈసారి వేలానికి పంపింది. అయితే ఈసారి అతడిని చెన్నై లేదా కోల్​కత్తా దక్కించుకోవచ్చు.

డేవిడ్​ మలన్​

టి20 లలో ప్రపంచ నెంబర్​ 1 ర్యాకింగ్​లో కొనసాగుతున్న ఇంగ్లాండ్​ స్టార్​ డేవిడ్​ మలన్​కు ఈసారి ఆక్షన్​లో మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్​, పంజాబ్​ జట్లు అతడిని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

శివం దూబే

విదేశీ ప్లేయర్ల తర్వాత.. గత సీజన్​లో బెంగళూరు తరపున రాణించిన భారత ఆల్​రౌండర్​ శివం దూబేకు మంచి ధర పలకొచ్చు. అతడిని తీసుకోవడానికి హైదరాబాద్​తో పాటు, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి.

శ్రీశాంత్​

బిసిసిఐ నిషేధం ముగియడంతో తిరిగి సయ్యద్​ ముస్తాఫ్​ ఆలీ ట్రోఫిలో పాల్గొన్న భారత ఒకప్పటి ఫాస్ట్​బౌలర్​ శ్రీశాంత్​ సైతం ఈసారి వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే అతనిపై ఉన్న మ్యాచ్​ ఫిక్సింగ్​ మచ్చ వల్ల అతడిని ఏ జట్టూ తీసుకోకపోవచ్చు!