సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తిరిగి ట్విట్టర్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.గతంలో వివాదాస్పద పోస్ట్ లతో ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో కంగనా ఖాతా నిలిచిపోయింది. దీంతో ఆమె ఇన్ స్టా గ్రామ్ కే పరిమితమైంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలు తప్ప ఏమీ లేదని.. అదొక మూగ ప్లాట్ ఫామ్ అంటూ ఆమె ఇటీవలే విమర్శించింది. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంతో, తిరిగి ట్విట్టర్ లోకి రావాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ఇదే మాదిరి ట్విట్టర్ లో నిలిచిపోయిన ఖాతాలు అన్నింటినీ పునరుద్ధరించేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో పోల్ పెట్టి యూజర్ల అభిప్రాయం కోరారు. మెజారిటీ యూజర్లు ఓకే అంటే చాలు.. బ్యాన్ అయిన ట్విట్టర్ ఖాతాలన్నీ మళ్లీ యాక్టివ్ గా మారనున్నాయి.