ఎపి‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న కైనెటిక్‌ గ్రీన్‌

By udayam on October 28th / 5:06 am IST

హైదరాబాద్: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్గో 3 వీలర్‌ సఫర్‌ జంబో వాహనాన్ని లాంచ్ చేసింది. హైదరాబాద్ లో ఈ వాహనాన్ని ఆవిష్కరించిన సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ సందర్బంగా మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్‌ గోల్ఫ్‌ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నామని  వెల్లడించారు.

‘గోల్ఫ్‌ కార్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం సెజ్‌లో యూనిట్‌ ఏర్పాటును పరిశీలిస్తున్నా మని, సెజ్‌లో యూనిట్‌తో పాటు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్‌ (మార్పిడి)కి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని    సులజ్జా ఫిరోదియా మోత్వానీ  తెలిపారు. అయితే  ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు.

భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్‌ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్‌ ఆఫ్‌–రోడ్‌ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్‌ గ్రూప్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ‘దేశంలోనే అతి పెద్ద త్రిచక్ర వాహనాల మార్కెట్లలో ఒకటైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఈ–రిక్షాలకు పెద్దగా మార్కెట్‌ లేకున్నప్పటికీ  హై–స్పీడ్‌ త్రీవీలర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటోందని,ఇలాంటి పరిస్థితుల్లో  బ్యాటరీ స్వాపింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తెస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలకూ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని  సులజ్జా విశ్లేషించారు.