మోడెర్నా కరోనా వ్యాక్సిన్​ 95 శాతం సురక్షితం!

By udayam on November 16th / 7:22 pm IST

అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ దాదాపుగా 95 శాతం సురక్షితమని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. మూడో దశ ప్రయోగ ఫలితాల ఆధారంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు.

నిజంగా ఎంత సురక్షితం?

ఇప్పటికే మరో అమెరికా కంపెనీ పి ఫైజర్​ తమ వ్యాక్సిన్​ 90 శాతం సురక్షితమని ప్రకటించిన కొద్ది రోజులకే మరో వ్యాక్సిన్​ ఫలితాలు ఆశాజనకంగా రావడం మానవాళికి శుభసూచకంగానే కనిపిస్తోంది.

దాదాపు 30 వేల మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పలితాలను విశ్లేషించిన తర్వాత తమ వ్యాక్సిన్​ 94.5 శాతం సురక్షితమని మోడెర్నా ఈరోజు ప్రకటించింది.

నిజంగా చాలా గొప్పరోజు : మోడెర్నా

మొత్తం 30 వేల మందికి నాలుగు వారాలకు ఒకసారి చొప్పున రెండు డోస్​లను ఇచ్చి పరీక్షించి ఫలితాలను రాబట్టారు. ‘‘ఇది చాలా గొప్ప రోజు” అని కంపెనీ చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ తాల్​ జాక్స్​ వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్​ గురించి మనకి తెలియనిది ఏమైనా ఉందా?

అయితే ఇప్పటికీ ఈ వ్యాక్సిన్​ ద్వారా విడుదలైన ఇమ్యూనిటీ శక్తి ఎంతకాలం ఉంటుందనేది తమకూ సరైన అవగాహన లేదని మోడెర్నా ప్రకటించింది.

అయితే ఈ వ్యాక్సిన్​ పెద్ద వయసు వారిలో సైతం ఇమ్యూనిటీ శక్తిని తిరిగి సాధించి పెట్టిందని మాత్రం వారు చెబుతున్నారు. ఈ మూడో దశ ఫలితాల ప్రకారం మేం ఈ వ్యాక్సిన్​ అత్యంత సమర్ధవంతమైనది అని మాత్రం చెప్పగలం అని తాల్​ జాక్స్​ అన్నారు.