ఆ 9 గంటల విచారణలో మోడీ టీ కూడా తాగలేదు: సిట్​ ఛైర్మన్​ రాఘవన్​

By udayam on October 27th / 2:54 pm IST

2002లో గుజరాత్​ అల్లర్ల సందర్భంగా సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం విచారణలో అప్పటి గుజరాత్​ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కనీసం టీ కూడా తాగకుండా ఏకధాటిగా 9 గంటల పాటు విచారణలో సహకరించారని ఆ కమిటీ ఛైర్మన్​, ఐపిఎస్​ అధికారి ఆర్​కె రాఘవన్​ వెల్లడించారు.

ఈ విషయాల్ని ఆయన తన పుస్తకం ‘ఎ రోడ్​ వెల్​ ట్రావెల్డ్​’లో పొందుపరిచారు. అప్పుడు మేం ఏకంగా 100కు పైగా కఠినమైన ప్రశ్నల్ని ఆయన్ను అడిగామని, వాటిల్లో ఒక్క దానికి కూడా ఆయన తడుముకున్నట్లు గానీ, మా మీద చికాకు పడినట్లు కానీ తాను గమనించలేదని, 9 గంటల పాటు కనీసం మేం ఇచ్చిన టీ కూడా తాగకుండా ఆయన మాకు సమాధానాలు ఇచ్చారని ఈ తమిళనాడు ఐపిఎస్​ అధికారి తన పుస్తకంలో పొందుపరిచారు.

2002లో గుజరాత్​ అల్లరపై నియమించిన సిట్​కు నాయకత్వం వహించిన ఆయన దాంతో పాటు పలు హై ప్రొఫైల్​ కేసులకు విచారణ అధికారిగా పనిచేశారు. వాటిలో బోఫోర్స్​ కుంభకోణం, 2000 సంవత్సరంలో సౌత్​ ఆఫ్రికా క్రికెట్​ మ్యాచ్​ ఫిక్సింగ్​, బీహార్​లోని దాణా కుంభకోణాలు ప్రధానమైనవి.

గుజరాత్​ అల్లర్లపై ఆయన పుస్తకంలో ‘‘మేం ముఖ్యమంత్రిని విచారించాల్సి ఉందని ఆయన కార్యాలయ సిబ్బందికి ముందుగా తెలియజేశాం.. ఆయన్ను విచారించకపోతే బయట ఆయన గురించి తప్పుగా అనుకుంటారని దాంతో ముందుగా ఆయన్నే ప్రశ్నిస్తామని కూడా చెప్పాం. నరేంద్ర మోదీ మేం ఎందుకు నియమించబడ్డామో అందరికంటే ముందుగా అర్ధం చేసుకున్నారు. దాంతో నేను రెడీనే అంటూ మాకు సమాధానం ఇచ్చారు.  దాంతో గాంధీనగర్​లోని గవర్నమెంట్​ కాంప్లెక్స్​లోనే ఆయనను ఏకధాటిగా 9 గంటల పాటు విచారించాం” అని తెలిపారు.

‘‘ఆయన మా ప్రశ్నల్ని తప్పించుకోవాలని చూడలేదు. కనీసం వాటి మీద ఎదురు దాడీ చేయలేదు. అన్నింటికీ ఎంతో ఓపికగా జవాబులు చెప్పారు. మేం లంచ్​ బ్రేక్​ తీసుకుందాం అని చెప్పాం. దానికీ ఆయన ఒప్పుకోలేదు. తనతో పాటు తెచ్చుకున్న ఒక మంచి నీటి బాటిల్​ను మాత్రమే ఆయన తాగేవారు. మేం టీ ఇచ్చినా పుచ్చుకోలేదు. అలా ఉదయం మొదలైన మా విచారణ రాత్రికి గానీ పూర్తవలేదు” అని తెలిపారు.

అయితే ఈ కమిటీ 2012లో నరేంద్ర మోదీ, మిగతా 63 మంది ప్రభుత్వ అధికారులకు ఈ అల్లర్లకు సంబంధించి క్లీన్​చిట్​ ఇచ్చింది. దీనిపై సిట్​ స్పందిస్తూ ‘‘అనుమానాస్పదంగా అనిపించే ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు” అని పేర్కొంది.