పాస్‌పోర్ట్ లో జపాన్ పవర్ ఫుల్

85వ స్థానంలో భారత్

By udayam on January 13th / 7:45 am IST

న్యూఢిల్లీ: ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్ –  2021 జాబితాలో ఇండియా 85వ ర్యాంకులో నిలిచింది.గతేడాది 84వ స్థానంలో నిలిచిన భారత్‌, ఈసారి ఒక స్థానం కిందికి జారింది.

పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో 191 స్కోరుతో జపాన్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం వరుసగా మూడు సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది 190 స్కోరుతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా కలిసి సంయుక్తంగా నిలిచాయి.

హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా విడుదల చేసింది. ఓ టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.

ఈ జాబితాలో ఇండియాకు 58 స్కోరు లభించింది. దీన్ని బట్టి  భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్ సహాయంతో 58 దేశాలను సందర్శించవచ్చు. ఆ దేశంలో దిగిన తర్వాత అక్కడ వీసా తీసుకోవచ్చు. తజికిస్థాన్‌ కు కూడా ఇదే  ర్యాంకు వచ్చింది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ ఈ ఏడాది కూడా అత్యల్ప స్కోరు 26తో చివరి స్థానాన్ని పొంది ప్రపంచంలోనే చెత్త పాస్‌పోర్ట్ గా నిలవగా,  పాకిస్తాన్ 32 స్కోరుతో చివరి నుంచి నాల్గవ ర్యాంకు దక్కించుకుంది.

188స్కోరుతో  ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ దేశాలు నాల్గవ స్థానంలో నిలిచాయి.  187 స్కోరుతో ఆస్ట్రియా, డెన్మార్క్ దేశాలు 5వ స్థానం పొందాయి.

186 స్కోరుతో ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ దేశాలు 6వ స్తానం; 185 స్కోరుతో బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ 7 వ స్థానం పొందాయి.

ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా దేశాలు  184 స్కోరుతో 8 వ స్థానం పొందగా, కెనడా 183 స్కోరుతో 9వ స్థానం లో నిల్చింది. హంగరీ దేశం  182 స్కోరుతో 10వ స్థానం పొందింది.