గజరాజుకు నిప్పుపెట్టి..

తమిళనాడులో హృదయవిదారక ఘటన

తీవ్రంగా కాలిన గాయాలతో మరణించిన 50 ఏళ్ళ ఏనుగు

By udayam on January 23rd / 7:27 am IST

జనవాసాల వద్దకు వచ్చిన ఓ 50 ఏళ్ళ ఏనుగుకు అక్కడి స్థానికులు నిప్పు పెట్టడంతో తీవ్రంగా కాలిన గాయాలతో అది మరణించింది. హృదయవిదారక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని మదుమలై అటవీ ప్రాంతంలో ఉండే 50 ఏళ్ళ ఏనుగు తరచూ జనావాసాల మధ్యకు వస్తుంటుంది. అది అలా వచ్చినా ఎవరికీ ఎలాంటి హానీ చేసేది కాదు. అయినప్పటికీ అక్కడి స్థానికులు దానిని తీవ్రంగా గాయపరిచేవారు.

దీంతో గత రెండు నెలలుగా దానికి అక్కడి స్థానిక అటవీ శాఖ అధికారులు వైద్యం చేసి తిరిగి దానిని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి వదిలి పెట్టారు.

అయితే ఈ నెల మొదటి వారంలో అది తిరిగి జనవాసాల మధ్యకు రావడంతో స్థానికులు టైరుకు మంట పెట్టి దానిని ఏనుగు మీదకు విసిరేశారు.

దీంతో ఆ ఏనుగు ఆ మంటలతోనే దూరంగా పారిపోయింది. అయితే తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో అది అక్కడే మరణించింది.

నిందితులు దొరికారు

దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో లభించిన క్లూస్​తో దర్యాప్తు చేయగా ప్రసాద్​, రేమండ్​ అనే ఇద్దరు నిందితులు దీనికి కారణమని గుర్తించి వారిని అరెస్ట్​ చేశారు.

వీరితో పాటు మరొకరు కూడా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

వీరిపై వైల్డ్​లైఫ్​ ప్రొటెక్షన్​ యాక్ట్​ (9) కింద కేసు నమోదు చేశామని ఒక్కొక్కరికి ఏడేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.