న్యూఢిల్లీ : పాస్‌పోర్టు దరఖాస్తుచేసుకోడానికి కేంద్రం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈమేరకు ‘‘పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు‘‘కు సంబంధించిన ‘‘డిజిలాకర్’’ ప్లాట్‌ఫామ్‌ను విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ ప్రారంభించారు.
పాస్‌పోర్ట్ దరఖాస్తుచేసుకునేందుకు అవసరమైన పత్రాలను డిజిలాకర్‌తో అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. డిజిలాకర్‌లో ఉన్న ధ్రువపతాల్రను ధ్రువీకరణ కోసం ఇక మీద ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది.
ఈ కొత్త సదుపాయం వల్ల దరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్ కేంద్రానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
గత ఆరేళ్లలో పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్లో ఎంతో మెరుగుదల కనిపించిందని, పాస్‌పోర్ట్ కోసం చేసుకునే దరఖాస్తుల సంఖ్య నెలలో అత్యధికంగా 10 లక్షల మార్క్ 2017లో అధిగమించిందని ఇప్పటి వరకు పాస్ పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా 7 కోట్ల పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని మంత్రి కేంద్రమంత్రి తెలిపారు.
ప్రజల ముంగిటకే పాస్‌పోర్ట్ సర్వీసులను తీసుకువెళ్లాలనే లక్ష్యసాధనదిశగా ప్రగతి సాధించామన్నారు. ఇక పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టు కార్యక్రమం పాస్‌పోర్ట్ సేవల్లో అనూహ్యమైన మార్పులను తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి చెప్పారు.
‘‘డిజిలాకర్’’ ప్లాట్‌ఫామ్ కొత్త సదుపాయంతో దరఖాస్తుదారులు కాగిత రహిత విధానంలో అవసరమైన పత్రాలను సమర్పించు కోవటానికి వీలుకలుగుతుందని చెప్పారు. పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా, కొత్తది జారీచేయడానికి డిజిలాకర్ దోహద పడుతుందన్నారు.