ఇకపై బయటవాళ్ళూ జమ్మూలో భూమి కొనొచ్చు.. కొత్త భూ చట్టానికి ఆమోదం తెలిపిన కేంద్రం

By udayam on October 28th / 2:25 am IST

ఇప్పటి వరకూ జమ్మూ కాశ్మీర్​లో భూమి కొనుగోలు చేయాలంటే ఆ రాష్ట్రంలోనే శాశ్వత నివాస సభ్యునిగా ఉండాల్సిన నిబంధనను కేంద్రం కొట్టేసింది. ఇకపై దేశంలోని ఎవరైనా సరే పెట్టుబడుల నిమిత్తం కానీ, వ్యాపార సంస్థల నిమిత్తం కానీ, సొంతంగానే భూమిని కొనుగోలు చేసేలా కొత్త భూ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ఆర్టికల్​ 370ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం జమ్మూ కాశ్మీర్​ ప్రజలకు మాత్రమే సొంతమైన అక్కడి భూమిని ఇకపై దేశంలోని ఎవరైనా కొనుగోలు చేసేలా ఈ చట్టంలో మార్పు చేసింది. ఇందుకోసం ‘ది జమ్మూ అండ్​ కాశ్మీర్​ ల్యాండ్​ రెవెన్యూ యాక్ట్​, 1996’ చట్టానికి సవరణలు చేసింది.

జమ్మూ కాశ్మీర్​లోని ఆర్టికల్​ 370 ప్రకారం ఇక్కడ పరిశ్రమల రాకకు అడ్డంకిగా మారిన ఈ విధానాన్ని ఇకపై రద్దు చేస్తున్నామని, దీంతో ఇక్కడ సైతం పరిశ్రమల రాకకు అవకాశాలు పెరిగి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.

లడఖ్​లోనూ ఇలాంటి చట్టాలే చేస్తాం..

మరో కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్​లో సైతం కేంద్రం కొత్త భూ చట్టాలకు పదును పెడుతోంది.

‘‘దేశంలో మిగతా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లే జమ్మూ కాశ్మీర్​, లడఖ్​ లు సైతం అభివృద్ధి చెందాలి. అదే సమయంలో ఇక్కడ శాంతి, అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సులకోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ఆ రాష్ట్ర లెఫ్టెనెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా వెల్లడించారు.

చట్టంలోని ముఖ్యమైన సవరణలు

  • ఈ కొత్త భూ చట్టం ప్రకారం ఇప్పటి వరకూ జమ్మూ ప్రజలకు మాత్రమే సొంతమైన అక్కడి భూమి ఇక నుంచి దేశంలోని ఎవరైనా సొంతానికి గానీ, వ్యాపార నిమిత్తం కానీ, స్కూల్స్​, పరిశ్రమల నిమిత్తం కానీ కొనుగోలు చేయవచ్చు.
  • బడా బడా పారిశ్రామిక వేత్తలకు సైతం ఇక్కడి నేలను పరిశ్రమల నిమిత్తం కొనుగోలు చేయవచ్చు.
  • ఇక్కడి వ్యవసాన నేలలో పరిశ్రమలను నెలకొల్పదల్చితే కేంద్రం నియమించిన బార్​ అనుమతి తప్పనిసరి.
  • ఇక్కడ కొనుగోలు చేసిన నేలను ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి గానీ, సంస్థకు గానీ, పరిశ్రమకు గానీ, ఆసుపత్రులకు గానీ బదిలీ చేసుకోవచ్చు.
  • ఈ కొత్త చట్టం ప్రకారం ఆర్మీలోని కార్ప్స్​ కమాండర్​ స్థాయి కంటే పెద్ద స్థాయి అధికారి ఇక్కడి ఏదైనా ప్రాంతాన్ని ‘వ్యూహాత్మక ప్రాంతం’గా అధికారం ఉంటుంది.