హఫీజ్​ సయీద్​కు పదేళ్ళ జైలు శిక్ష

టెర్రరిస్టులకు డబ్బు సాయం చేసిన కేసులో శిక్ష ఖరారు చేసిన పాకిస్థాన్​ కోర్టు

అతనితో పాటు మరో ఇద్దరు జెయుడి నేతలకు సైతం

By udayam on November 19th / 1:28 pm IST

ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్​లోని పంజాబ్​కు చెందిన లాహోర్​ యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ళ ఆరు నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. అతడితో పాటు జమాత్​ ఉద్​ దవా (జెయుడి) అగ్ర నాయకులైన జాఫర్​ ఇక్భాల్​, యాహ్యా ముజాహిద్​లకు సైతం శిక్షల్ని ఖరారు చేసింది.

మొత్తం రెండు కేసులకు గానూ ఈ శిక్షల్ని ఖరారు చేస్తున్నట్లు జడ్జి అర్షద్​ హుస్సైన్​ భుట్టా వెల్లడించారు. ఈ శిక్షలతో పాటు హఫీజ్​ సయీద్​ పేరిట ఉన్న అన్ని ఆస్థి పాస్తులను సైతం ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఒక్కొక్కరిపై రూ.పది వేల రూపాయల అపరాధ రుసుం కూడా విధించింది.

జెయుడి లోని రెండవ స్థానంలో ఉన్న హఫీజ్​ బావ మరిది అబ్దుల్​ రెహ్మాన్​ మక్కి కి సైతం ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమకూర్చినట్లు తేలడంతో 6 నెలల జైలు శిక్ష విధించారు.

ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ (ఎఫ్​ఎటిఎఫ్​)తో పాటు భారత్​ సైతం పాకిస్థాన్​ను ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న వారిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ వేదికలపై నిలదీయడంతో పాక్​ హఫీజ్​పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.