బీహార్ తొలివిడత పోలింగ్ ప్రారంభం

By udayam on October 28th / 5:22 am IST

పట్నా: బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్‌ నవంబర్‌ 3న, మూడో దశ పోలింగ్‌ నవంబర్‌ 7న నిర్వహిస్తారు. ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి. కొవిడ-19 మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదటివిడత 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

లఖిసరాయ్ పట్టణంలోని 168వ పోలింగ్ బూత్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగుప్రకియకు అంతరాయం వాటిల్లింది. కాగా సాయుధ పహరా మధ్య నడుస్తున్న పోలింగ్ ప్రక్రియలో భాగంగా  ఔరంగాబాద్ జిల్లా ధిబ్రా ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన రెండు మందుపాతరలను సీఆర్ పీఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకొని వాటిని విధ్వంసం చేశారు.

ఇక పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు ప్రముఖ నాయకులు అందరూ ఆలయాలను, ప్రార్థనాలయాలను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌.. లఖిసరాయ్‌లోని బారాహియాలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ.. ప్రజాస్వామంలో ఎన్నికలు అనేవి పండుగ లాంటివని, ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.