ఒకపక్క బురద మరోపక్క దొంగతనాలు…హైదరాబాద్ ప్రజల ఇక్కట్లు

By udayam on October 28th / 6:36 am IST

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు వరదలా మారి కాలనీలను ముంచెత్తుతోంది. చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని బీఎన్‌.రెడ్డి నగర్‌ వారం రోజుల కితం కురిసిన భారీ వర్షాలకు జలమయం కావడం చూసాం. అయితే, ఈ కాలనీలో ఉన్న ఖాళీ ప్లాట్లు, విశాలమైన స్థలాల్లో నిలిచిన వరదనీటిని బయటకు వదలడంతో రోడ్లపై ఉరకలెత్తింది. అసలే అధ్వానపు రోడ్లు, దీనికి తోడు వర్షాలకు గుంతలుపడి కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.

ఇక తమ ఇళ్ల పక్కన వరదనీరు ఇలా నిలిచి ఉంటే ప్రమాదమని కొందరు ఇళ్ల యజమానులు ఖాళీ ప్లాట్లలోని నిల్వ నీటిని బయటకు వెళ్లేలా కాలువలు తీయడంతో దాదాపు నాలుగు వీధులు జలమయమయ్యాయి. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసినట్లు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

మరోపక్క వరదలు, ముంపులతో నగర జనం అతలాకుతలమవుతోంటే.. కొందరు దొంగలు ఇదే అదనుగా భావించి తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించారు. చాలామంది ఇళ్ళు వదిలిన చాలామంది ఇప్పటికీ తెలిసిన వారు, బంధువుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నారు. భవంతులున్న కొన్నిచోట్ల గ్రౌండ్‌ ఫ్లోర్‌ వదిలి ఫస్ట్‌ఫ్లోర్‌లకు షిఫ్టు అయ్యారు.

అవకాశం లేని వారు ఎలాగోలా ఆయా బస్తీలు దాటి రోడ్లపైకి వచ్చి తెలిసిన వారి వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వరదముంపు బాధితుల ఇళ్లను కొల్లగొడుతున్న వైనం  ప్రస్తుతానికి ఒకటి, రెండు బస్తీల్లో  వెలుగు చూసింది.